తెలంగాణలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ?

Telangana By Polls


తెలంగాణలో జూబ్లీహిల్స్, గోషామహల్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ, ఈ మూడు నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే, రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో కీలకమైన మార్పులు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

BRS


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు గుర్రాల కోసం బీఆర్ఎస్ కసరత్తు

గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ తో పాటు, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు కూడా టికెట్ రేసులోకి వచ్చారు. అమెరికాలో ఉన్న మాగంటి కుమారుడు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని గులాబీ నాయకులను అడిగినట్లు సమాచారం. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు టికెట్ ఆశించడంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. మాగంటి కుటుంబానికి టికెట్ ఇవ్వక పోతే తమ పేరును పరిశీలించాలని మరి కొందరు నాయకులు హైకమాండ్‌ను కోరుతున్నట్లు సమాచారం. హైకమాండ్ మాత్రం గెలుపు గుర్రానికే టికెట్ ఇస్తామని చెబుతోంది. దీనిపై సర్వే కూడా చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Raja Sing


గోషామహల్ సందిగ్ధంలో రాజా సింగ్ రాజకీయ భవితవ్యం

జూబ్లీహిల్స్‌తో పాటు, మరో రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పగ్గాలను మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుకు అప్పగించడంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపరని, హైకమాండ్ పెద్దలు పిలిచి బుజ్జగిస్తారని రాజా సింగ్ భావించినప్పటికీ, హైకమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ రాజా సింగ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, రాజా సింగ్ మాత్రం అంతకంటే ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా, రాజా సింగ్ మహారాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో శివసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ తెలంగాణలో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లేదు. దీంతో శివసేన తెలంగాణ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకునే ఆలోచనలో రాజా సింగ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Danam Nagendar


ఖైరతాబాద్ దానం నాగేందర్‌పై అనర్హత వేటు ?

మరోవైపు, ఖైరతాబాద్‌లోనూ ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గెలుపొందారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీ మారారు. దీంతో దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా కూడా పోటీ చేశారు. ఈ నెలాఖరు లోపు ఈ కేసులో తీర్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సైతం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన దానం నాగేందర్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ పెద్దలను కోరారు. తనకు మంత్రి పదవి ఇస్తే, ఖైరతాబాద్‌లో రాజీనామా చేసి మళ్లీ గెలుస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, దానం రాజీనామాపై క్లారిటీ ఇవ్వని హైకమాండ్, రాజీనామా చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉండాలనే సంకేతాలను పంపించిందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌తో పాటు ఖైరతాబాద్, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగడం ఖాయమని అంటున్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఇలా జరుగుతుందని చెప్పడం కష్టమే. కానీ,  జూబ్లీహిల్స్, గోషామహల్, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికలు జరిగితే మాత్రం తెలంగాణ రాజకీయ వాతావరణం మరో సారి వేడెక్కే అవకాశం ఉంది. పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, మారుతున్న ప్రజాభిప్రాయాల మధ్య రాబోయే ఎన్నికలు రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని మలుపు తిప్పే అవకాశం వుంది.

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి